ఏపీ: రాజకీయాల్లో ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు పెరుగుతున్నాయి. స్థానిక నాయకులు పదవులపై పరస్పరం విమర్శలు చేసుకుంటూ కూటమి సమైక్యతపై ప్రశ్నార్ధక పరిస్థితి కల్పిస్తున్నారు.
టీడీపీ నాయకులు తాము పని చేస్తున్నామని, ఇతర పార్టీల నాయకుల వల్లే సమస్యలవుతున్నాయని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో జనసేన, బీజేపీ నాయకులు తమకు గుర్తింపులేకపోవడం, క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయంటూ వాదిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి సమైక్యతపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, “ఎవరేమి చేసినా, మేము మాత్రం కలిసే ముందుకు సాగుతాము. క్షేత్రస్థాయిలో ఉండే వివాదాలు తాత్కాలికం. మన ఉద్దేశ్యం ఒకటే – ప్రజల కోసం పనిచేయడం” అని పేర్కొన్నారు.
2029 లేదా జమిలి ఎన్నికలు ఏవి వచ్చినా కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. “మమ్మల్ని విడదీసేందుకు చాలామంది ప్రయత్నించవచ్చు, కానీ మేం కలిసి పనిచేయడమే లక్ష్యం” అని అన్నారు. క్షేత్రస్థాయిలో కూడా నాయకులు కలసి పనిచేయాలని ఆయన పరోక్షంగా సందేశం ఇచ్చారు.
ఇలాంటి క్లారిటీతో కూటమి నాయకత్వం నడిపినప్పుడు, క్షేత్రస్థాయిలో కూడా సమన్వయం అనివార్యం. దీనిపై నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏ పార్టీ అయినా కలిసిమెలిసి ఉంటేనే ప్రజల మన్ననలు పొందగలుగుతారు.