అంతర్జాతీయం: భారత ప్రధానికి నైజీరియా అత్యున్నత గౌరవం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ అత్యున్నత సన్మానం ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్’ పురస్కారాన్ని అందజేసింది.
1969లో క్వీన్ ఎలిజబెత్ IIకి ఈ గౌరవం అందించిన తర్వాత, ఈ విశిష్టమైన బహుమానాన్ని అందుకుంటున్న మొదటి విదేశీయుడిగా మోదీ రికార్డులకెక్కారు.
అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఇది 17వ పురస్కారం కావడం గమనార్హం.
మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియాలో అడుగుపెట్టిన ఆయనకు అబుజాలో ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్వో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మోదీకి సింబాలిక్‌గా అబుజా నగరపు కీని కూడా అందజేశారు.
నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టారు.
ఆదివారం ఉదయం అధ్యక్షుడి నివాసంలో టినుబును కలిసిన మోదీ, ఈ అత్యున్నత గౌరవం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కేవలం తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, 140 కోట్ల భారతీయుల సత్కారం అని పేర్కొన్నారు.
ఇది భారతదేశానికి, ఇండియా-నైజీరియా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవం అని అభివర్ణించారు.
మోదీ ఈ పర్యటన అనంతరం జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి బ్రెజిల్ వెళ్లనున్నారు.
నవంబర్ 18, 19 తేదీల్లో రియో డీ జనీరోలో జరిగే ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వంటి ప్రపంచ దేశాధినేతలు కూడా పాల్గొంటారు.
నవంబర్ 19న మోదీ గయానా వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు 21వ తేదీ వరకు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.