ఏపీ: అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలు పెను సంచలనానికి కారణమయ్యాయి. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైసీపీ ప్రభుత్వంలోని నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ, “జగనన్న ఇళ్లు” పథకం కింద పేదలకు భూముల పేరుతో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. వైసీపీ నేతలు రాబందుల్లా ప్రవర్తించి, అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ భూములను ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించారని తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యవహారాన్ని మొదట సభలో ప్రస్తావించగా, మిగతా సభ్యులంతా దీనిపై తీవ్ర చర్చ జరిపారు. అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, అసైన్డ్ భూముల్లో 9 లక్షల ఎకరాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు.
ఆయా భూముల సేకరణలో వైసీపీ నేతలు భూములను ముందుగానే కొనుగోలు చేసి, ఆ తర్వాత అధిక ధరలకు ప్రభుత్వానికి విక్రయించినట్లు పేర్కొన్నారు.
వైసీపీ నేతలతో పాటు, వారి అక్రమాలకు సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి, అభ్యంతరాలను పరిష్కరిస్తామని తెలిపారు.
చర్చలో అసెంబ్లీలో ఉన్న టీడీపీ సభ్యులు అధికారుల తీరుపై ప్రశ్నలు అడగగా, మంత్రి అనగాని జిల్లాల వారీగా అక్రమాల వివరాలు తెలిపారు. అనంతపురం, గుంటూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో భారీ భూ అక్రమాలు జరిగినట్లు వివరించారు.