మహారాష్ట్ర: ముంబై ఓటు ఎటువైపు?
ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రతిష్టాత్మకంగా మారాయి.
36 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ఈ నగరంలో ప్రధాన పార్టీల కూటములు ఎదురెదురుగా తలపడటమే కాకుండా, మరికొన్ని ఇతర పార్టీల సమీకరణలు కూడా వేడి రాజేస్తున్నాయి.
2019లో బీజేపీ-శివసేన దూకుడు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిగా 36 స్థానాల నుంచి 30 సీట్లు గెలుచుకుంది.
ఇందులో బీజేపీ 16, శివసేన 14 సీట్లు కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుత ఎన్నికలలో మహాయుతి కూటమిలో బీజేపీ 18, షిండే శివసేన 16, అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ 2 స్థానాల్లో బరిలోకి దిగింది.
మరోవైపు మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన 22, కాంగ్రెస్ 11, శరద్ పవార్ వర్గం ఎన్సీపీ 2 సీట్లలో పోటీ చేస్తోంది. శివసేన విడిపోవడంతో, ఏ శిబిరానికి ముంబై ఓటర్లు మద్దతు తెలుపుతారనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
2024 లోక్‌సభ ఫలితాలు మార్పు సూచన
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ముంబైలో 6 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
మిగిలిన నాలుగు సీట్లు ఎంవీఏ కూటమికి దక్కాయి—ఉద్ధవ్ శివసేన 3, కాంగ్రెస్ 1. ఈ విజయంతో ఎంవీఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.
మహాయుతి కూటమి మాత్రం తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఓటర్లను ఆకర్షిస్తాయని ఆశిస్తోంది.
రాజ్ ఠాక్రే ప్రభావం
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎ్‌స) అధినేత రాజ్ ఠాక్రే 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టారు.
దీనివల్ల సంప్రదాయ బీజేపీ-శివసేన ఓట్లు చీలిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా వర్లీ నియోజకవర్గంలో ఆదిత్య ఠాక్రే, బీజేపీకి చెందిన మిలింద్ దేవరా, ఎంఎన్‌ఎ్‌స అభ్యర్థి సందీప్ దేశ్‌పాండే మధ్య ముక్కోణపు పోరు జరుగుతోంది.
ఈ చీలికతో ఎంవీఏకు లాభమా, నష్టమా అనేది ఆసక్తికరంగా మారింది.
ముస్లిం ఓట్లలో చీలిక భయం
మజ్లిస్ పార్టీ (AIMIM) వెర్సోవా, శివాజీనగర్ వంటి ప్రాంతాల్లో పోటీ చేస్తుండటంతో, ముస్లిం ఓట్లు చీలిపోవడం ఎంవీఏ కూటమికి ఇబ్బంది కలిగించొచ్చు.
గత ఎన్నికల్లో మజ్లిస్ ప్రభావం కాంగ్రె్‌స-ఎన్సీపీ కూటమి ఓటర్లకు నష్టాన్ని కలిగించింది.
ఈ సారి కూడా ఇదే పరిస్థితి పునరావృతం కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.