హైదరాబాద్: మెట్రో రెండో దశ నిర్మాణానికి సంబంధించి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. రెండో దశలో మొత్తం 76 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
అయితే ఈ దశ నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకున్నదని గుర్తుచేశారు. ప్రైవేటు రంగం నుంచి ఆసక్తి లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని వివరించారు.
ఎల్ అండ్ టీ సంస్థకు మొదటి దశలో భారీ నష్టం రావడం, నిర్వహణలో ప్రతీ ఏడాది రూ.1,300 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం వల్ల ప్రైవేటు సంస్థలు రెండో దశ నిర్మాణంలో వెనుకడుగు వేసినట్లు పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులను ప్రభుత్వాలు స్వయంగా నిర్వహిస్తున్న ఉదాహరణలను ప్రస్తావించారు. రుణాలు పొందడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతోనే నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయం అంచనా వేయగా, ఇందులో 48 శాతం నిధులు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) నుంచి సమకూరనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని, కేంద్ర అనుమతులు రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ప్రజల ప్రయాణానికి మరింత సౌలభ్యం కలిగించడంతో పాటు, నగర అభివృద్ధికి తోడ్పడుతుందని వివరించారు.