ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు నారా రామ్మూర్తి మరణం తర్వాత తొలిసారి సభకు హాజరైన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.
జగన్‌కు ఆ అవకాశం ఇవ్వబోమని, ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లుగా ఉంచి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 3.08 శాతం మాత్రమే పనులు జరిగాయని, తమ హయాంలో రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వివరించారు.
జగన్ టీఎంసీ, క్యూసెక్కుల తేడా కూడా తెలియదంటూ ఆయన ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ నాయకులు పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను అవమానకరంగా చూపిన సందర్భాలను గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం దృష్టి వల్ల పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రూ.12,000 కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు వెల్లడించారు.
వచ్చే నెలలోనే ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమవుతాయని, జనవరి నుంచి డయాఫ్రం వాల్ నిర్మాణం మొదలవుతుందని తెలిపారు.
ప్రాజెక్టును విడతల వారీగా పూర్తి చేసి, 2027 నాటికి పూర్తిగా సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు తాగునీరు, సాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.