తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ దర్యాప్తు కొనసాగుతోంది. చాలా కాలంగా ఈ విషయం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు పలువురు అధికారులను విచారించిన ఈ కమిషన్, ఈ నెలాఖరున బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలిపించనుందని సమాచారం.
ఈ కేసు విషయంలో మరిన్ని వివరాలు సేకరించేందుకు కమిషన్ ఈ నెల 21న హైదరాబాద్‌కు రానుంది. కమిషన్, కాళేశ్వరం పనుల్లో అవకతవకలపై స్పష్టత తెచ్చేందుకు ఏప్రిల్ 5 వరకు వివిధ అధికారులను విచారించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రాజెక్టు ప్రారంభ సమయంలో కీలక పాత్ర పోషించిన అధికారులతో పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావును కూడా పిలిపించనున్నట్లు సమాచారం.
కానీ, కేసీఆర్ విచారణకు హాజరవుతారా అనే అనుమానం ఇంకా కొనసాగుతోంది. కమిషన్ ఇప్పటికే ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అధికారులపై దృష్టి సారించింది.
అప్పటి సీఎస్‌లు ఎస్కే జోషి, సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన రజత్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య సలహాదారు స్మితా సబర్వాల్ వంటి అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.