ఆంధ్రప్రదేశ్లో వలంటీర్ వ్యవస్థ ముగిసినట్టేనా? శాసన మండలిలో మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన వింటే అవుననే అనిపిస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శాసన మండలిలో ఈ వ్యవస్థపై చర్చ జరుగగా, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వివరించిన తీరు ఆసక్తికరంగా మారింది. 2023లో వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకోలేదని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు మంత్రి వెల్లడించారు. 2023లో రెన్యువల్ కోసం సెప్టెంబరులో జీవో జారీ చేయాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదని, అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వలంటీర్ల కడుపు కొట్టారని ఆయన వివరించారు.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వ్యవస్థను కొనసాగించడంలో ఏమిటి సమస్య అని ప్రశ్నించారు. ఎన్నికల కారణంగా ఉత్తర్వులు జారీ చేయలేకపోయినా, కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థను పునరుద్ధరించడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
దీనిపై మంత్రి డోలా స్పందిస్తూ, గతంలో రెన్యువల్ జీవోలు ఏటా జారీ చేసిన జగన్ ప్రభుత్వం, 2023లో జీవో ఇవ్వకపోవడానికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం తమ ఓటమి భయంతో ముందే ఈ వ్యవస్థను నాశనం చేయాలని నిర్ణయించుకుందా అనే ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.
వలంటీర్ల జీతాల విషయంలో కూడా వివరణ ఇచ్చిన మంత్రి, ఇప్పటి వరకు వారు ఉద్యోగాల్లో లేకపోయినా జీతాలు ప్రభుత్వం చెల్లించినట్టు తెలిపారు. అయితే, నేటికీ ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అనువైన పరిస్థితులు లేవని చెప్పకనే చెప్పారు.