ఢిల్లీ: ఐపీఎల్ 2025 మెగా వేలం క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సారి రిషబ్ పంత్ వేలంలోకి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను రిటైన్ చేయకపోవడం వెనుక కారణాలు వివిధ చర్చలకు దారితీస్తున్నాయి.
కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఉన్న పంత్, 20 కోట్లకు పైగా ధర పలుకుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ పంత్‌ను రిటైన్ చేయకపోవడానికి అతని డిమాండ్ అని, అడిగినంత డబ్బు ఇవ్వకపోవడమే కారణమంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో పంత్ స్పందించారు.
“నా రిటెన్షన్ విషయంలో డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు” అంటూ పంత్ వ్యాఖ్యానించారు. అయితే విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం పంత్ బయటపెట్టలేదు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్కంఠ రేకెత్తించాయి.
పంత్‌పై ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు వేలంలో ఆసక్తి చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సునీల్ గావస్కర్ కూడా “పంత్‌ను ఢిల్లీ తిరిగి వేలంలో కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో జరగనున్న మెగా వేలంలో పంత్ అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా నిలుస్తారని భావిస్తున్నారు. పంత్ రిటెన్షన్ వివాదం క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.