ఏపీ: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడును ఆకాశానికెత్తుతూ, ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.
వచ్చే ఐదేళ్లే కాదు, మరో పది సంవత్సరాలు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నాయకత్వంలో మేం పనిచేయడం మా గౌరవం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పవన్ మాట్లాడుతూ, చంద్రబాబు విజన్ 2047ను అమలు చేయడానికి తాను, తన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
“తెలుగు ప్రజలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబును మించిన నాయకుడు లేడు. ఆయనను కలిసిన ప్రతిసారి ఏదో కొత్తదనం నేర్చుకుంటాను. విజయవాడ వరదల సమయంలో ఆయన తీరు అందరికీ స్పూర్తి” అన్నారు.
పవన్ తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “వైసీపీ నిర్లక్ష్యం వల్లనే బుడమేరులో వరదలు వచ్చాయి. కానీ చంద్రబాబు తన వయసును తక్కువ చేస్తూ, ప్రజలకు అండగా నిలబడ్డారు. అలాంటి నాయకుడి సాన్నిధ్యం అనివార్యం” అన్నారు.
చంద్రబాబును ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడిగా కొనియాడిన పవన్, తన అసెంబ్లీ ప్రసంగం ద్వారా టీడీపీ, జనసేన కూటమి బలాన్ని మరోసారి రుజువు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.