తెలంగాణ: స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకి వెళ్తాం – కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభాపతి నిర్ణయం తీసుకోకుంటే, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావుల ద్విసభ్య ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పు విషయమై ఆయన స్పందించారు.
సభాపతిని నిర్ణయం తీసుకునేలా ఆదేశించే అధికారం కోర్టుకు లేదని, గతంలో చేసిన వాదనలు గుర్తు చేస్తూ, రీజనబుల్ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలని సీజే బెంచ్ సారాంశం వెల్లడించిందని కేటీఆర్ తెలిపారు.
రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలల గడువని, ఈ విషయం మణిపుర్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తుచేశారు.
తాజాగా వెలువడిన ఈ తీర్పులో, అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు ప్రత్యేకంగా టైమ్ బాండ్ లేకుండా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇవ్వబడిందని కోర్టు తేల్చిచెప్పింది.
స్పీకర్ విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు పరోక్షంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలితే పార్టీ మారిన ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట కలిగినట్టయ్యింది.