హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఘోర పరాజయం చెందగా, కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ చేసిన ఖర్చు, ప్రసంగాలు, హెలికాప్టర్ ప్రయాణాలు ఏవీ కాంగ్రెస్ ఓటమిని నిలువరించలేదని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ, మహారాష్ట్ర పరాజయం రేవంత్ లాంటి నాయకుల అసమర్థతను సూచిస్తుందని అన్నారు. రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టకుండా, ఎన్నికల ప్రచారంలో శక్తిని వృథా చేసిన రేవంత్ రెడ్డి ప్రజలతో ఇచ్చిన హామీల అమలుపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రత్యేకంగా రైతులపై జరుగుతున్న అన్యాయాలను పక్కన పెట్టి జాతీయ స్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పనిచేస్తోందని విమర్శించారు.
లగచర్ల ఫార్మా భూముల బాధిత రైతుల గురించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఆ రైతులపై కేసులు పెట్టి జైలులో పెట్టడం దుర్మార్గమని, ప్రజలు దీనికి సమయోచిత ప్రతిస్పందన ఇస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలులో కలిసిన అనంతరం, న్యాయ పోరాటం కొనసాగుతుందని ధైర్యం ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు సాధించిన విజయాలను కాజేస్తున్నాయని కేటీఆర్ అన్నారు.
దేశ భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి పాపం పండే రోజు దగ్గరలో ఉందని, ప్రజలు ఆయన తప్పులను గమనిస్తున్నారని విమర్శించారు.