ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వికృత క్రీడఫై ఉక్కుపాదం
“సోషల్ మీడియా” సామాన్య జనం నుంచి.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు విస్తృతంగా వినియోగిస్తున్న టెక్నాలజీ.
అయితే “సోషల్ మీడియా” దారి తప్పుతోంది… అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలతో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
రాజకీయ ప్రచారానికి వినియోగించడంతోపాటు ప్రత్యర్థులు, వారి కుటుంబీకులు, ఆ కుటుంబాల మహిళలు, చిన్నపిల్లలపై బూతులతో వ్యక్తిత్వ హననం చేయడానికి సామాజిక మాధ్యమాలను కొందరు ఉపయోగిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.
ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్న ఈ వికృత క్రీడ నేడు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యగా తయారు అయింది.
తమకు ఇష్టమైన నేతల కళ్లల్లో ఆనందం కోసం వికృతచేష్టలతో రెచ్చిపోతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
అయితే వీరిలో చదువుకున్న యువకులు ఎక్కువశాతం ఉండడం ఆందోళన కలిగించే అంశం.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఒక మహిళా మంత్రి గురించి సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరగడం, తరువాత ఆ మహిళా మంత్రి స్పందించిన తీరు ఏకంగా కోర్టులో పరువు నష్టం కేసుల వరకు వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే…
ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసభ్య యుద్దానికి హద్దులు లేకుండా పోయింది, ఈ అసభ్య యుద్ధం తీవ్రమై ఇంటిలోని మహిళల వరకు కూడా పాకింది.
ఈ అసభ్య చర్యలపై కట్టడిచేయాలని తెలుగు రాష్ట్రాలు నడుంకట్టి SMASH పేరుతో హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక యాక్షన్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇతరులను రెచ్చగొట్టడంతోపాటు వర్గాల మధ్య విభేదాలు సైతం సృష్టించి అలజడి రేపేందుకు కొన్ని విద్రోహ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు పోలీసులు పసిగడుతున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ “సోషల్ మీడియా” కేసుల్లో ఇరుకుంటే ఏ కేసులు చుట్టుకుంటాయో ఒకసారి పరిశీలిస్తే…
ఫేక్, మార్ఫింగ్ పోస్టింగ్‌లు: ఫేక్, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పెడితే అవతల వారి వ్యక్తిత్వాన్ని అవమానిస్తే డీఎన్ ఎస్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువు అయితే 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.5లక్షల వరకు జరిమానా విధిస్తారు.
అసభ్యకర పోస్టులు: అసభ్యకర పోస్టులు పెడితే 67ఏ సెక్షన్ కింద కేసు నమోదవుతుంది. 5 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
ప్రముఖ వ్యక్తుల పేర్లు దుర్వినియోగపరిస్తే: ప్రముఖ వ్యక్తుల పేరుతో అసభ్యకర పోస్టులు పెడితే 66(డి)సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు. 3 ఏళ్ళు జైలుశిక్ష, రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు.
తప్పుడు పత్రాలు సృష్టించి ఒక వ్యక్తి పరువుకుభంగం కలిగిస్తే బీఎన్‌ఎస్ చట్టంలోని 336(4)సెక్షన్ కింద కేసు పెడతారు.
సంఘంలోని సమూహాలు, సంఘాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే బీఎన్‌ఎస్ చట్టంలోని 362(2)సెక్షన్‌తో పాటు పరువు నష్టం కింద కేసు నమోదవుతుంది.
జుగుప్సాకరంగా ఉన్న చిత్రాలు, ఫొటోలు పోస్ట్ చేస్తే ఎలకా్ట్రనిక్ ఆధారాలుగా పరిగణించి బీఎన్‌ఎస్ చట్టంలోని 353(2)కింద కేసు తప్పదు.
ఈ కేసుల్లో ఇరుకుంటే..
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న విద్యార్థులు, యువత కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎదుర్కొనే సమస్యలు. NOC పత్రం జారీ సమయంలో స్టేషన్ రికార్డుల్లో కేసులు నమోదై ఉంటే NOC ఇవ్వరు. పైగా, విదేశాల్లో చదువు లేదా ఉద్యోగాలకు పాస్‌పోర్టు జారీలో కూడా ఇబ్బంది తప్పదు.
దీంతో పాటు విదేశాల్లో నివసిస్తూ కూడా భారతదేశం నుంచి అసభ్య పోస్టులు పెడుతున్నవారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తారు.