సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చడంపై పోలీసులకు సుప్రీం అల్టిమేటం జారీ చేసింది
న్యూ ఢిల్లీ: భూ వివాదాల వంటి సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి, పౌరులను వేధించే పద్ధతిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ (యూపీ) పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్రంగా మండిపడుతూ, తక్షణమే విధానంలో మార్పు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది.
ఈ అంశంపై గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌ల ధర్మాసనం విచారణ నిర్వహించింది. భూ వివాదాలకు సంబంధించి తనపై అనేక క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయని, తనతో సహా కుటుంబసభ్యులపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని యూపీకి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
కోర్టు ముందుంచిన పిటిషన్‌లో, దశాబ్ద కాలంగా వివిధ భూ వివాదాలకు సంబంధించి ఆ వ్యక్తిపై డజనుకుపైగా కేసులు నమోదైన విషయాన్ని ధర్మాసనం గమనించింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు యూపీ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి పౌరులను వేధించడం అనాగరికం. ఈ విధానాన్ని తక్షణమే మార్చుకోకపోతే డీజీపీపై జీవితాంతం గుర్తుండిపోయేలా ఆదేశాలు జారీ చేస్తాం’’ అని కోర్టు తీవ్రంగా స్పందించింది.
యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాణా ముఖర్జీ మాట్లాడుతూ, పిటిషనర్ విచారణకు సహకరించడం లేదని, కానీ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతున్నారని వాదించారు.
అయితే కోర్టు, “యూపీ పోలీసులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.. పూర్తిగా సివిల్ వివాదాలపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్నారు.. డీజీపీకి మేము చెప్పిదే ఒకటే ఈ పద్దతి పోలీసులు తక్షణమే మార్చుకోకుంటే.. మీకు జీవితాంతం గుర్తిండిపోయే ఆదేశాలు ఇస్తాం” అని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.
అంతేకాదు, కోర్టు అనుమతి లేకుండా ఎటువంటి కొత్త కేసు నమోదుచేసి.. పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది.
కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన యూపీ లాయర్ ముఖర్జీ, పోలీసుల తీరు ప్రభుత్వం గమనించి, అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పోలీసుల పద్ధతుల్లో మార్పుకు నాంది కావాలని ఆశిద్దాం.