పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ: పదో తరగతి పరీక్షలలో గ్రేడింగ్, ఇంటర్నల్ మార్కుల విధానం రద్దు చేసిన ప్రభుత్వం.. పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇంటర్నల్ మార్కుల ప్రణాళికకు ముగింపు
తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విధానంలో ముఖ్యమైన మార్పులు తీసుకువస్తోంది. 2024-25 విద్యా సంవత్సరం నుండి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానానికి స్వస్తి చెప్పింది.
100 మార్కులకు పరీక్షలు
ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేసింది. కొందరు టీచర్లు కావాలనే ఉద్ధేశపూర్వకంగా కొందరు విద్యార్థులకు ఎక్కువ, మరికొందరికి తక్కు వ మార్కులు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇకపై ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు 600 మార్కులు కేటాయించబడతాయి.
గ్రేడింగ్ విధానానికి గుడ్‌బై
2011లో ప్రారంభమైన గ్రేడింగ్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ సంప్రదాయ మార్కుల పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు.
పరీక్షల నిర్వహణలో పలు మార్పులు
పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాల సంఖ్య గతంలో 11 ఉండేది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్టుకు ఒకే పేపర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజా మార్పులతో విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌ను ఉపయోగించవచ్చు. సైన్స్‌కు ప్రత్యేకంగా ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్‌కు 12 పేజీల చొప్పున బుక్‌లెట్లు అందిస్తారు.
ఇంటర్నల్ మార్కుల రద్దు వెనుక కారణాలు
ఇంటర్నల్ మార్కులలో కొన్ని అంశాలపై విమర్శలు రావడం, ముఖ్యంగా టీచర్లు మార్కుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారన్న అభియోగాలు ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. ప్రతి విద్యార్థికి సమానమైన అవకాశాలు కల్పించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చారు.
పదో తరగతి పరీక్షల చరిత్ర
2014-15 నుంచి తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను 80 మార్కుల ఫైనల్ పద్ధతిలో నిర్వహిస్తోంది. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్ల విధానం ఉండేది. ఈ విధానంలో తలెత్తుతున్న ఆలస్యం కారణంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఒక పేపర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.