మూవీడెస్క్: పుష్ప 2 ప్రీమియర్ల సందడి ఊహించని విషాదానికి దారితీసింది. హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్‌కు చెందిన రేవతి ప్రాణాలు కోల్పోయింది.
రేవతి పిల్లలు శ్రీతేజ, శాన్వి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తండ్రి భాస్కర్ మాట్లాడుతూ, కొడుకు అల్లు అర్జున్ వీరాభిమాని కావడం వల్లే ఈ షోకు హాజరయ్యామని, రద్దీ వల్ల తమ కుటుంబం తీరని నష్టం చవిచూసిందని వాపోయారు.
ఈ ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. వారి బృందం బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం చేస్తుందని, పిల్లల చికిత్సను నేరుగా పర్యవేక్షిస్తామని ప్రకటించారు.
బన్నీ ఇప్పటివరకు వ్యక్తిగతంగా స్పందించనప్పటికీ, బాధిత కుటుంబ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని సమాచారం.
ఈ విషాదం సినీ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జనసందోహం, శ్రద్ధా రహిత నిర్వహణ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అనిపిస్తోంది.
ముఖ్యంగా ప్యాన్ ఇండియా మూవీ పుష్ప-2 లాంటి సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో స్పెషల్ షోల నిర్వహణకు మెరుగైన నియంత్రణ అవసరం.
చిన్న పిల్లలు, మహిళల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు హెచ్చరికగా ఈ ఘటన నిలుస్తోంది.
సినీ పరిశ్రమ తరచూ రీ రిలీజ్‌లు, స్పెషల్ షోలకు ఎక్కువ మక్కువ చూపుతూనే ఉంది.
కానీ వీటి నిర్వహణలో నిర్లక్ష్యం, భద్రతా లోపాల వల్ల జరిగిన ఈ దుర్ఘటనలో పోయిన ప్రాణాలు తిరిగి రాకపోయినా, తగిన జాగ్రత్తలతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.