ఏపీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు మరో గొప్ప గౌరవం అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ చట్టంలోని ఆర్టికల్ 15 ప్రకారం, రఘురామ ఈ పదవిలో ఉన్నంతకాలం కేబినెట్ హోదా వర్తించనుంది. ఈ క్రమంలో, ప్రొటోకాల్, భద్రతా చర్యలు కేబినెట్ స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డిప్యూటీ స్పీకర్ హోదాకు కేబినెట్ ర్యాంక్ కేటాయించడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా విభజన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణరాజు, మంత్రిపదవి లేదా స్పీకర్ పదవిని ఆశించినా, ఆయనకు డిప్యూటీ స్పీకర్ హోదా మాత్రమే లభించింది.
రఘురామ ఆశించిన మంత్రిపదవి అందుకోలేకపోయినప్పటికీ, తన పనితీరుతో అసంతృప్తిని వ్యక్తం చేయకుండా కొనసాగారు.
ఈ సమయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సేవలకు మరింత గౌరవం ఇవ్వాలని భావించి, కేబినెట్ హోదా కల్పించడం విశేషం.
ఈ నిర్ణయంతో రఘురామకృష్ణరాజుకు అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరగడంతో పాటు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర మరింత బలపడనుంది.