తెలంగాణ: ప్రజా పాలన విజయోత్సవం – హోంగార్డులకు చల్లని కబురు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా పోలీసుశాఖలో కీలక పాత్ర పోషించే హోంగార్డ్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రస్తుతం హోంగార్డులకు అందిస్తున్న రోజు వారి వేతనాన్ని రూ. 920 నుంచి రూ. 1000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ. 100 నుంచి రూ. 200కి పెంచి హోంగార్డ్స్ సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపించామన్నారు.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు హోంగార్డులు మరణిస్తే, వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు సీఎం తెలిపారు. హోంగార్డులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ఆరోగ్యశ్రీ సదుపాయాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మార్పులు జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తాయని వెల్లడించారు.
పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన “యంగ్ ఇండియా పోలీస్ స్కూల్” ప్రారంభించామన్నారు. ఈ స్కూల్‌లో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు సైనిక్ మరియు డిఫెన్స్ స్కూల్ ప్రమాణాలతో ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు.
ప్రత్యేక కార్యక్రమంలో ఎస్డీఆర్‌ఎఫ్ విభాగానికి కొత్త వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి, హోంగార్డ్స్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వేతనాల పెంపుతో పాటు మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని తెలిపారు.
హోంగార్డులు పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారని ప్రశంసించిన సీఎం, వారికి అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ప్రమాదాల్లో మరణించిన ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు రూ. 2 కోట్లు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు కూడా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సీఎం పలు సంక్షేమ పథకాల వివరాలను వెల్లడిస్తూ, ప్రజలతో ప్రభుత్వం ఎల్లప్పుడూ కలిసి పని చేస్తుందని అన్నారు. పోలీసు శ్రేయస్సుకు అవసరమైన అన్ని విధాలా మద్దతు అందిస్తామని స్పష్టం చేశారు.