తెలంగాణ: తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై రేవంత్ సర్కార్‌పై కేసీఆర్ విమర్శలు
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, డిసెంబర్ 9న సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న విగ్రహాన్ని తిరస్కరించి, కొత్త విగ్రహం ఏర్పాటుచేయడంపై వివిధ రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందిస్తూ, ఈ నిర్ణయాన్ని మూర్ఖత్వంగా అభివర్ణించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేసీఆర్, విగ్రహ మార్పుపై తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తిని ప్రజల్లోకి చేరవేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాల మార్పులపై చర్చలు కొనసాగించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.
అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు వ్యూహాలు రూపొందించాల్సిందిగా బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేసి, వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి నిలదీయాలని సూచించారు.
రైతు బంధు వంటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి చేర్చే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని కేసీఆర్ ప్రకటించారు.
కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అన్నది అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సమావేశాలకు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేయగా, ఈసారి కేసీఆర్ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఫిబ్రవరిలో జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ మరోసారి ప్రజల్లోకి వెళ్లి, బీఆర్ఎస్ పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు కమిటీల ఏర్పాటు కూడా చేపట్టనున్నారు.