అమరావతి: ఏపీ లోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. నిర్దేశిత సమయంలోగా వినతులు, దరఖాస్తుల పరిష్కారం, అమలును పర్యవేక్షించేందుకు పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
అర్జీదారు చేసుకున్న దరఖాస్తు ఎక్కడ ఆగినా సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా పీఎంయూ కాల్‌సెంటర్ పనిచేస్తుంది. దరఖాస్తు పెండింగులో ఉంటే ఉదయం డిజిటల్ మెసేజ్ వస్తుంది, మధ్యాహ్నం లోగా కూడా పరిష్కారం కాకుంటే నేరుగా సంబంధిత సిబ్బందికి పీఎంయూ కాల్ చేయనుంది. పీఎంయూలో 200 మంది వరకు సిబ్బంది పనిచేస్తారు. మొదటగా నాలుగు రకాల సేవలపై పర్యవేక్షణను అమల్లోకి తెచ్చారు. అక్టోబర్ నుంచి మొత్తం 543 రకాల సేవలపై పీఎంయూ దృష్టి పెట్టనుంది.
ముఖ్యాంశాలు: (PMU CALLCENTER IN AP)
► కొత్త బియ్యం కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి సచివాలయాల్లో అందే దరఖాస్తులను నిత్యం ఫాలో అప్ చేసి పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు. సచివాలయ ఉద్యోగి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీఓ, సెక్రటరీల స్థాయి వరకూ ఫాలోఅప్ చేయడం జరుగుతుంది.
► 10 రోజుల్లో కొత్త బియ్యం కార్డు, 10 రోజుల్లో వైఎస్సార్ పెన్షన్ కానుక, 20 రోజుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా కచ్చితంగా రావాలి. నిర్ణీత సమ యంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏమిటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియాలి. వెంటనే సంబంధిత కలెక్టర్తో, జేసీతో మాట్లాడేలా ఉండాలి. ఆ స్థాయిలో ప్రజల వినతుల మీద దృష్టి ఉండాల్సిందే.
► కాల్ సెంటర్లో ఆటోమేటిక్ ప్రాసెస్ ఉండాలి, డేటా అనలిటిక్స్ రావాలి.
► జవాబుదారీతనం ఉండాలి. అలసత్వం ఎక్కడ ఉన్నా తెలియాలి.
► కాల్‌సెంటరే కాకుండా దరఖాస్తుల పెండింగ్‌పై సెక్రటరీ, కలెక్టర్, జేసీ తదితర స్థాయి అధికారులకు అలర్ట్స్ వెళ్లేలా మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా ఉండాలి.