తెలంగాణ: సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనకు కొత్త మలుపు తలెత్తింది. థియేటర్ యాజమాన్యం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న ప్రత్యేక ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరగా, అది క్రౌడ్ నియంత్రణలో కష్టంగా మారుతుందని పోలీసులు ముందుగానే హెచ్చరించారు.
చిక్కడపల్లి పోలీసులు థియేటర్ యాజమాన్యానికి రాతపూర్వకంగా వారిని ఆహ్వానించవద్దని సూచించారు. కానీ, ఈ హెచ్చరికలను పక్కన పెట్టి అల్లు అర్జున్ థియేటర్‌కు విచ్చేయడం వివాదానికి కారణమైంది. ఆయన మాత్రమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ కూడా నిర్వహించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.
అల్లు అర్జున్ థియేటర్‌కు రాగానే అభిమానులు ఉత్సాహంతో థియేటర్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకొని రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులకు పోలీసులు వెంటనే సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే రేవతి చికిత్స పొందుతూ మృతిచెందారు.
మృతిచెందిన మహిళ వివరాలు తెలుసుకున్న వెంటనే పోలీసులు అల్లు అర్జున్‌ను థియేటర్ నుంచి పంపించారు. కానీ, అక్కడి నుంచి బయటకు వెళ్లేముందు ఆయన మళ్లీ ర్యాలీ ద్వారా అభిమానులను పలకరించడాన్ని పోలీసులు తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ అంశాన్ని నాంపల్లి తొమ్మిదో మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట పోలీసులు ప్రవేశపెట్టగా, కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా ఆయన విడుదలయ్యారు.