తెలంగాణ: అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం వివాదాస్పదంగా ముగిసింది. సమావేశాలు కేవలం 3-4 రోజులకు పరిమితం చేయడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
విపక్షాలు కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వ నిర్ణయం అందుకు వ్యతిరేకంగా ఉండడంతో చర్చలు ఘర్షణలకు దారితీశాయి.
బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. సభ్యుల హాజరుపై నిబంధనలు, ప్రత్యేకించి టీషర్టుల విషయంపై వివాదం తలెత్తింది.
టీషర్టులతో అసెంబ్లీలోకి రావడంపై ప్రశ్నించడాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. “ప్రజా సమస్యలపై చర్చకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇలాంటి ఆంక్షలే ఎందుకు?” అని నిలదీశారు.
విపక్షాలు ప్రభుత్వంపై జీరో అవర్ ప్రాధాన్యతను మరిస్తోందని ఆరోపించాయి. ముఖ్యంగా లగచర్ల రైతుల సమస్యలపై చర్చ జరగాలన్న డిమాండ్లను ప్రభుత్వం తుంగలో తొక్కినట్లుగా ఉన్నదని పేర్కొన్నాయి.
ఈ తీరుతో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్న ఆశలు దూరమవుతాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మరింత ఉద్రిక్తతకు దారితీయనున్నాయి.