గబ్బా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ యువ బౌలర్ ఆకాశ్ దీప్‌పై అసహనాన్ని ప్రదర్శించిన ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఆసీస్ బ్యాటర్ అలెక్సీ కేరీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ్ వేసిన ఓవర్‌లో వికెట్లకు దూరంగా బంతిని విసరడంతో, రిషబ్ పంత్ బంతిని అందుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది.
ఈ ఘటనపై రోహిత్ స్టంప్ మైక్ ద్వారా “నీ బుర్రలో ఏమైనా ఉందా?” అంటూ సెటైర్ వేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రోహిత్ ఇలా బహిరంగంగా అసహనం చూపించడం తగునా? అనే చర్చ నడుస్తోంది. కొందరు రోహిత్ ప్రవర్తనను తప్పుపడుతున్నప్పటికీ, మరికొందరు కెప్టెన్‌గా రోహిత్ తన బాధ్యతలను నెరవేర్చాడని అంటున్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ సాధించడంతో, భారత బౌలింగ్ విభాగం కఠినంగా శ్రమించింది.
జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో మెరిశాడు, కానీ మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగుల వద్ద నిలిచిన టీమిండియా బ్యాటింగ్ పునరాగమనం చేయగలదా? అనేది ఉత్కంఠగా మారింది.