ఆంధ్రప్రదేశ్: కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష చేపట్టారు. శాశ్వత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, గత ఆరు నెలలుగా మంత్రుల పనితీరుపై నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం.
సంక్రాంతికి ముందే ఈ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
నివేదిక ప్రకారం, నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి వంటి మంత్రులు ముందంజలో ఉన్నారు.
వీరు విధులను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. అయితే, కొంతమంది మంత్రులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రిపోర్టులో స్పష్టమైన నిందలున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేకంగా మహిళా మంత్రుల్లో సవిత తన దూకుడు, పనితీరుతో చంద్రబాబు అభినందనలు అందుకున్నారని చెబుతున్నారు. మరోవైపు కొన్ని శాఖలు అసంతృప్తికర స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నివేదికను ఆధారంగా తీసుకొని అవసరమైతే మంత్రుల బాధ్యతల్లో మార్పులు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ రిపోర్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కావడం ఖాయం.