ఏపీ: పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించారు.
నిన్న ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ఈ కార్యాచరణను కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు.
పోలవరం నిర్మాణంలో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం గ్యాప్-1 పనులను 2026 ఫిబ్రవరికి కాకుండా 2025 జులైలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. అలాగే, లెఫ్ట్ కెనాల్ పనులు 2026 జులై నాటికి పూర్తి చేయాలని తెలిపారు.
భూసేకరణ ప్రక్రియను 2025 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని, కుడి కాలువ పనులను 2026 ఏప్రిల్‌కు ముందే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ముందుగానే 2025 డిసెంబరులో పూర్తి చేయాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు నీటిని ఎడమ, కుడి కాలువల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రణాళికల ద్వారా ప్రాజెక్టును నిర్దేశిత కాలంలో పూర్తి చేసి, రాష్ట్రానికి నీరందించడమే లక్ష్యమని తెలిపారు.