హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రేవతి కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసానిచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని, రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంలో అల్లు అర్జున్ ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఆసుపత్రికి రాలేకపోయారని, తన తరఫున తానే ఆసుపత్రికి వచ్చానని తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని, థియేటర్ల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారీ క్రేజ్ ఉన్న సినిమాల వేళ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రేవతి కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ విషయంలో న్యాయం చేయాలని ఆయన ఆకాంక్షించారు.