ఏపీ: వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డికి ఏపీ హైకోర్టు మరోసారి తాత్కాలిక ఊరట ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసుల్లో ఆయనపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ భార్గవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా భార్గవరెడ్డి తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
కేసులు విచారణకు అర్హతలేనివని, సంబంధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదులు రాలేదని కోర్టుకు వివరించారు. ఐటీ చట్టం సెక్షన్స్ కాకుండా, నాన్ బెయిలబుల్ సెక్షన్లను అన్వయించారని న్యాయవాది తెలిపారు.
హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. అదే సమయంలో, భార్గవరెడ్డిపై అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలను పొడిగించింది. ఈ కేసులపై నోటీసులు జారీ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.