హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా నిందితులుగా చేర్చారు.
విదేశీ కంపెనీకి అనుమతి లేకుండా రూ. 55 కోట్ల చెల్లింపులు జరిపారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. గత నెలలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా, నాలుగు రోజుల క్రితం కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం ఇచ్చారు.
ఈ అనుమతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏసీబీకి లేఖ పంపారు. దీనిపై ఏసీబీ నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద 13 (1)ఏ, 13 (2) పీసీ యాక్ట్, 409, 102బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
కేటీఆర్ పై కేసు నమోదైన నేపథ్యంలో, త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ శ్రేణులు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తిగా మారింది.