యూఎస్: అమెరికాలో బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ కొత్తగా కలకలం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో 34 మంది ఈ వైరస్ బారిన పడినట్టు నిర్ధారణ కావడంతో గవర్నర్ గవిన్ న్యూసమ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ డెయిరీ ఫాంలో తొలిసారి ఈ వైరస్ బయటపడటంతో అక్కడి ఆరోగ్య శాఖ యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది.
వైరస్ ప్రభావంతో డెయిరీ ఫాంలో పనిచేసిన ఉద్యోగులు, వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ఆరోగ్యం దెబ్బతినిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
అయితే, ఈ వైరస్ వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువని నిపుణులు స్పష్టం చేశారు. డెయిరీ ఫాంలోని ఆవులకు వైరస్ సోకడంతో మరింత జాగ్రత్త అవసరమని అధికారులు హెచ్చరించారు.
ప్రజలను భయాందోళనలకు గురి చేయకుండా నివారించేందుకు ప్రభుత్వం ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలు, డెయిరీ ఫాంలను కఠిన నియంత్రణల కింద ఉంచింది.
ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించి, ఎలాంటి అస్వస్థత కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.