మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాజా సాబ్ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన విడుదల కావాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డేట్‌పై గందరగోళం నెలకొంది.
ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ చిత్రాన్ని అదే తేదీన రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించడంతో, ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ గాయం కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్ షూటింగ్‌కు తిరిగి వచ్చేలోపు మరింత సమయం పడుతుందని ప్రచారం సాగుతోంది.
దీంతో మేకర్స్ విడుదలను జూన్ లేదా జూలైకి వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
దీనికి తోడు ఏప్రిల్ 10వ తేదీకి మరో రెండు చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న జాట్, అలాగే నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ చిత్రాలు కూడా అదే డేట్‌ను టార్గెట్ చేశాయని టాక్.
ప్రస్తుతం మేకర్స్ ప్రభాస్ చిత్రానికి మంచి డేట్ అన్వేషిస్తున్నారని, మిగతా సినిమాల డేట్స్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త షెడ్యూల్ అనౌన్స్ చేస్తారని చెబుతున్నారు.
రాజా సాబ్ పై ఉన్న భారీ అంచనాలను బట్టి, విడుదల తేదీ మరింత కీలకంగా మారిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.