హైదరాబాద్: మూసీ నదీ ప్రక్షాళనలో ప్రభుత్వానికి అడ్డు తగులుతోందని బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
నల్గొండ జిల్లాను మురుగునీటి నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుంటే, బీఆర్ఎస్ నేతలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
ప్రక్షాళన వద్దంటారు, రుణమాఫీ వద్దంటారు, ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకం చేస్తారు… ఈ పరిస్థితుల్లో ఇంకేం చేయాలని రేవంత్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని మంచి వ్యక్తులు ఉన్నారని, వారు పరిస్థితుల వల్ల మాత్రమే అక్కడ ఉండాల్సి వస్తుందని చెప్పారు.
కేటీఆర్, హరీష్ రావులను సవాల్ చేస్తూ, గన్ మన్‌లను తీసుకురాకుండా మూసీ నది వద్దకు రావాలని ఛాలెంజ్ విసిరారు. స్పీకర్‌పై దాడి చేయడం అనుభవం చూపించడమేనా? అని హరీష్ రావును ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించారు.
మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం గట్టిగా దృష్టి సారించిందని, కానీ బీఆర్ఎస్ పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ఆందోళనలకు ప్రజలు సమాధానం చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు.