ఏపీ: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ హయాంలో రూపొందించిన వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నిధులు అక్రమంగా ఉపయోగించినట్టు ఆరోపణలు రావడం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు వర్మతో పాటు ఆ సమయంలో ఉన్న ఫైబర్ నెట్ ఎండీ, మరికొందరికి నోటీసులు పంపారు.
నోటీసుల ప్రకారం, వ్యూహం సినిమాకు తగినంత వ్యూస్ రాకపోయినా ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి రూ.1.15 కోట్లు చెల్లించారు.
ఇది నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ, 15 రోజుల్లో వడ్డీతో సహా మొత్తాన్ని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నిధుల మంజూరుకు సంబంధించిన సమాచారం దర్యాప్తు జరుగుతుండగా, ఈ నోటీసులు వర్మకు కొత్త చిక్కుగా మారాయి.
అయితే, ఈ నోటీసులపై వర్మ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన వర్మ, ఈసారి ఈ ఆరోపణలపై ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి.