హైదరాబాద్ : ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 15న ఉదయం 10.30 గంటలకు తన అధికారిక నివాసం అయిన ప్రగతిభవన్‌లోనే జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు. గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ.
అయితే కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపించి ఉన్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించాల్సిన ఈ వేడుకలను ఈసారి ప్రగతిభవన్‌కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన జారీ చేయవలసి ఉంది.
తెలంగాణ రాష్ట్రం లో జిల్లాస్థాయిలో మంత్రులు, ఇతర ముఖ్యులు స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా సంబంధిత జిల్లా కలెక్టరేట్లలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ముఖ్య అతిథుల జాబితాను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
వారితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ/డీసీఎంఎస్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు వారి జిల్లాస్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. ఉదయం 9.30 గంటలకు వీరంతా తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించింది.
మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్‌లు జాతీయను జెండాను ఆవిష్కరించాలని స్పష్టం చేసింది. కరోనా మమహ్మరి నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లను వినియోగించాలని ఆదేశించింది.