హైదరాబాద్: డిసెంబర్ 30న తెలంగాణ మంత్రివర్గం సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఈ సమావేశంలో రైతు భరోసా పథకం అమలు, రేషన్ కార్డుల నిర్వహణ, భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ విధానంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అంశంపై చర్చించనున్నారు. స్వయం సహాయక బృందాలకు ఉపాధి కల్పనకు సంబంధించి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రికల్ బస్సుల పంపిణీపై సమీక్ష నిర్వహించనున్నారు.
తాజాగా సీఎస్ శాంతికుమారి వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి విడతలో ఐదు జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
మహిళా సంఘాలకు ఉపాధి కల్పనతో పాటు, ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక వనరులను సమకూర్చనున్నారు.
ఈ ప్రణాళికల అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.