తిరుమల: శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతిపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ నుండి వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల సిఫార్సు లేఖలను పరిమితి మేరకు అనుమతించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
వారానికి నాలుగు సిఫార్సు లేఖల వరకు మాత్రమే అనుమతిస్తూ, వాటిలో రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 ప్రత్యేక దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు.
ఈ విషయంపై టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడుతో చర్చించిన చంద్రబాబు, సిఫార్సు లేఖల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. అయితే, మాజీ ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు.
తెలంగాణ నేతలు తిరుమలలో భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిన నేపథ్యంలో, చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
సిఫార్సు లేఖల పరిమితిపై ఈ తాజా నిర్ణయం భక్తులకు సమర్థమైన దర్శనాన్ని అందించడానికి దోహదపడుతుందని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.