చెన్నై: కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వారికి చాలా మంది కోలుకున్నారు, ఇంకొంతమంది కోలుకుంటున్నారు. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఆగస్టు 5 వ తేదీన చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో చేరారు. అయితే ప్రస్తుతం ఐసియూ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. గురువారం రాత్రి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఐసీయూ కి తరలించినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 13న అర్థ రాత్రి సడన్ గా బాలసుబ్రమణ్యం పరిస్థితి క్షీణించిందని ఎంజీఎం హెల్త్ కేర్ తన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వైద్య నిపుణుల సూచన మేరకు ఆయన్ను ఐసీయూలో చేర్పించి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. వైద్య నిపుణుల బృందం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. “బాలు నువ్వు త్వరగా లేచి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. సినిమా మనకి జీవనాధారం మాత్రమే. సంగీతంలో స్వరాలు ఎలా విడిపోవో మనం ఎప్పటికీ విడిపోము. మన మధ్య గొడవ ఉన్న అది స్నేహమే. లేకపోయినా స్నేహమే. నా మనసు నమ్ముతోంది నువ్వు త్వరగా కోలుకుంటావని. బాలు లేచి వచ్చేయి”. వైరాన్ని కూడా పక్కన పెట్టి ఇళయరాజా కూడా ఎస్ పి బాలు త్వరగా కోలుకోవాలని తన వీడియో సందేశాన్ని ఇలా చెప్పారు. అయితే బాలు కొడుకు అయిన ఎస్ పి చరణ్ తన తండ్రి ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది కానీ స్టేబుల్ గానే ఉన్నారు అని ట్వీట్ చేసాడు.