హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొంత కాలంగా సినిమాలు తగ్గించాడు. నటనకి ఆస్కారం ఉన్న పాత్రనే వేస్తున్నాడు. తనలోని నటుడిని సంతృప్తి పరచే పాత్రలు వస్తే తప్ప వేరే సినిమాలు ఒప్పుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో ఆయన నుండి వచ్చిన సినిమాలే ఆ విషయాన్నీ బలపరుస్తాయి. చివరి సారిగా ఆయన మహానటి సినిమాలో ‘ఎస్ వీ రంగారావు’ పాత్రలో మెరిశాడు. తన నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు వస్తే పూర్తి రోల్ కాకపోయినా కూడా సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ఫుల్ లెంగ్త్ రోల్ లో వస్తున్న సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’.
తన సొంత బ్యానర్లు అయినటువంటి శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రచయితగా చాల మంచి సినిమాలు చేసిన ‘డైమండ్ రత్నబాబు’ ఆది సాయికుమార్ తో తీసిన ‘బుర్ర కథ’ అంతగా ఆకట్టుకోకపోయిన కూడా తరువాతి ప్రయత్నంగా మంచి కథతో వస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఈ టైటిల్ పోస్టర్ ని కూడా దేశభక్తి నేపథ్యంలో నడిచే కథ అని చెప్పే విధంగా డిజైన్ చేసారు. మోహన్ బాబు సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. టైటిల్ లో అశోక చక్రం, బ్యాగ్రౌండ్ లో ఇండియా మ్యాప్ కనిపించేలా పోస్టర్ రూపొందించారు. చాలా గ్యాప్ తీసుకొని సందేశాత్మక చిత్రంలో మోహన్ బాబు నటిస్తున్నారు. మోహన్ బాబు ఇదివరకే తీసిన ‘మేజర్ చంద్రకాంత్’ లాంటి చాలా దేశభక్తి చిత్రాలు మంచి హిట్ గా నిలిచాయి. ఈ సినిమాతో మరోసారి దేశభక్తి చిత్రంతో హిట్ ట్రాక్ రావాలని ఆశిద్దాం.