అంతర్జాతీయం: అమెరికాలో కార్చిచ్చు కల్లోలం.. విలాసగృహాలు దోపిడీ
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఘోరమైన కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగల్చింది. ఓవైపు మంటలు అందించిన విధ్వంసం కొనసాగుతుండగా, మరోవైపు దోపిడీ దొంగలు ఖాళీగా ఉన్న విలాసవంతమైన గృహాలను దోచుకుంటున్నారు. కార్చిచ్చు కారణంగా అధికంగా ప్రభావితమైన ప్రాంతాలలో ధనవంతులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసిన ఇళ్లలో విలువైన వస్తువులను కొంతమంది దొంగతనం చేశారు.
ఇటీవల లాస్ ఏంజెలెస్ షరీఫ్ డిపార్ట్మెంట్ దాదాపు 20మంది లూటర్లను అరెస్టు చేసింది. ప్రజల సంక్షోభాన్ని దోచుకోవడం సిగ్గుచేటని కౌంటీ సూపర్వైజర్ కాథరిన్ బెర్జర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా అక్కడ భద్రతా విభాగం గస్తీని మరింతగా పెంచింది.
కాలిఫోర్నియాలో విధ్వంసం
పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతం పూర్తిగా దగ్ధమైంది. ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఇదే సమయంలో 83 ఏళ్ల వృద్ధుడు కార్చిచ్చులో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ప్రస్తుతం ఆరుకు చేరింది. మొత్తం 9,000 నిర్మాణాలు కాలిపోయాయి. ఒక్క పాలిసాడ్స్‌లోనే 5,300 ఇళ్లు దహించబడ్డాయి.
ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్నిత్ ప్రాంతంలో మంటలు అంటించాడనే అనుమానంతో భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. మొత్తం 1.80 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.
రూ.12 లక్షల కోట్ల నష్టం
కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత పెద్ద నష్టం ఇది. అక్యూవెదర్ అంచనాల ప్రకారం, ఈ కార్చిచ్చు 150 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12 లక్షల కోట్లు) నష్టం మిగిల్చిందని పేర్కొంది. కేవలం 24 గంటల్లోనే ఈ అంచనాలు మూడింతలు పెరగడం గమనార్హం.
బీమా రంగానికి భారీ దెబ్బ
అమెరికా బీమా సంస్థలు ఈ కార్చిచ్చుతో భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం, 20 బిలియన్ డాలర్ల వరకు బీమా క్లెయిమ్‌లు రావచ్చని అంచనా. కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థలు గతంలోనే కార్చిచ్చు ముప్పు ఉన్న ప్రాంతాల్లో పాలసీలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.
విద్వంసానికి ప్రతిస్పందన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కార్చిచ్చు బాధిత ప్రాంతాల కోసం ఆరు నెలల పాటు ప్రభుత్వ సహాయ చర్యలు ప్రకటించారు. శిథిలాల తొలగింపు, పునర్నిర్మాణ చర్యలకు మద్దతు అందిస్తామని తెలిపారు.
జల సమస్యలు
అగ్నిమాపక చర్యలకు నీటి కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ఫైర్ హైడ్రాంట్లు తక్షణమే ఖాళీ కావడం, తక్కువ వాటర్ ప్రెజర్ ప్రధాన సమస్యలుగా మారాయి.
బన్నీ మ్యూజియం విధ్వంసం
ప్రపంచంలోనే అతిపెద్ద బన్నీ మ్యూజియం పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 46,000 కుందేళ్ల రూపంలోని కలెక్షన్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. గతంలో ఇది గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించింది.