ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఒంటరిని కావడం చర్చనీయాంశమైంది. ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా ఉన్నా, స్థానిక రాజకీయాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
దీంతో, ఢిల్లీలో ఆప్ ఒంటరి ప్రయాణానికే సిద్ధమైంది. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ వంటి పార్టీలు ఆప్‌కు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ ఒంటరిని అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే రాహుల్ ఎలాంటి ప్రణాళికలు రచించకుండా ఈ సమయంలో మౌనంగా ఉండడం పార్టీ పై ప్రభావం చూపుతుందనే కామెంట్స్ వస్తున్నాయి.
గతంలో బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి, అధికారంలోకి వచ్చే ఆశలు వ్యక్తం చేసినా, ప్రస్తుత పరిస్థితుల్లో మిత్రపక్షాలు కాంగ్రెస్‌ను పక్కన పెట్టడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనిపై కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుందో వేచిచూడాలి.