పిఠాపురం: మాజీ ఎమ్మెల్యే వర్మ తాజాగా పునరుత్తేజం పొందినట్టుగా కనిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించిన సందర్భంగా వర్మకు స్వయంగా ఆహ్వానం పలకడం, వేదికపై పవన్ పక్కన కూర్చోబెట్టుకోవడం గమనార్హం.
వర్మకు పవన్ నుంచి కీలక హామీ లభించినట్లు అనుచరులు భావిస్తున్నారు. వర్మ గతంలో తన టీడీపీ సీటును జనసేన నేత కోసం త్యాగం చేశారు.
ఆ తర్వాత మంత్రి వర్గంలో చోటు లేకపోవడం, జనసేన నేతల నుంచి పలుమార్లు అవమానాలు ఎదుర్కోవడం వర్మలో నిరుత్సాహాన్ని కలిగించింది. అయితే, ఈ పర్యటనతో వర్మకు కొత్త ఆశలు చిగురించాయి.
పవన్ హామీ మేరకు క్షత్రియ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, చైర్మన్ పదవిని వర్మకు అప్పగించే ప్రణాళిక ఉందని అనుచరులు చెబుతున్నారు. కేబినెట్ ర్యాంకు కలిగిన ఈ పదవి వర్మకు రాజకీయంగా బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతో జరిగిన చర్చల్లో వర్మకు భరోసా ఇవ్వబడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు పిఠాపురంలో రాజకీయ సమీకరణాలను మారుస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయం, తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.