ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ ఇవ్వొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రవాణా శాఖ చర్యలు తీసుకుంది.
ఈ నిర్ణయంతో యూపీలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ప్రతి ఏడాది యూపీలో 26 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించకపోవడం కారణంగా మరణిస్తున్నట్టు అంచనా.
ఈ నేపథ్యంలో హెల్మెట్ ధారణను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ పంపు యాజమాన్యాలు ఈ నిబంధన పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధనపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధారణను కొంతమేర అమలు చేస్తున్నా, పెట్రోల్ పంపుల వద్ద ఇప్పటికీ సడలింపు ఉంది.
అయితే, ఏపీలో మాత్రం కూటమి సర్కారు హెల్మెట్ విషయంలో మరింత పటిష్టంగా వ్యవహరిస్తోంది. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై చలానాలు వేయడం మొదలుకొని, హెల్మెట్ కొనుగోలుకు ప్రోత్సహించేందుకు పోలీసులు కూడా అడుగుపెడుతున్నారు.
యూపీ తరహా నిబంధన తెలుగునాట అమలైతే మరింత ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.