ఒకప్పుడు సినిమాలు థియేటర్ లలో పోటీ పడేవి. ఇపుడు పరిస్థితి మారింది. సినిమాలు ఓటీటీల్లో పోటీ పడుతున్నాయి. ఒక్కో ఓటీటీ ఇతర ఓటీటీలతో పోటీ పడి నిలదొక్కుకునేందుకు చాలా కొత్త సినిమాలని స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ సమయంలో తెలుగు సినిమాలని స్ట్రీమ్ చేయడంలో అల్లు వారి ‘ఆహా’ దూకుడుగా ముందడుగు వేస్తుంది. వేరే బాషా సినిమాలని డబ్ చేయడమే కాకుండా కొత్త తెలుగు సినిమాలని కూడా స్ట్రీమ్ చేస్తుంది. అందులో భాగంగానే ‘జోహార్‘ అనే కొత్త సినిమాని స్ట్రీమ్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘జోహార్’ అనే కొత్త సినిమాని విడుదల చేసింది.
కథ, కథనం:
వివిధ రకాల నేపధ్యాలు ఉన్న నలుగురి కథలు, వారి జీవితాల్లో పడే సంఘర్షణ, చివరికి వాళ్ళందరి జీవితాలను ప్రభావితం చేసే ఒక నిర్ణయం.. ఇలా సాగుతూ పోతుంది ఈ సినిమా. ఒక రాష్ర ముఖ్యమంత్రి మరణం తర్వాత ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్య మంత్రి అయిన అతని కొడుకు తీసుకున్న నిర్ణయం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వేశ్య గృహం నేపధ్యం నుండి వచ్చిన ఎస్తేర్ అనిల్ (దృశ్యం ఫేమ్), చాయి దుకాణం లో పని చేసే అబ్బాయి, సర్కస్ చేస్తూ అథ్లెట్ అవ్వాలనుకునే ఒక అమ్మాయి (నైనా గంగూలీ), ఉద్దానం కిడ్నీ ప్రాబ్లెమ్ తో భర్త పోగొట్టుకున్న రైతు గా ఈశ్వరి రావు, అనాధాశ్రమాన్ని నడిపే వృద్ధ స్వాతంత్య్ర సమరయోధుడిగా శుభలేఖ సుధాకర్.. ఇలా వివిధ నేపధ్యాలతో ఒక కథను నడిపించారు డైరెక్టర్.
ఇలా ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా పార్టీ లేదా సొంత ఎజెండా కోసం పని చేసే రాజకీయా నాయకుల కనువిప్పు కోసం తీసిన సినిమాగా ఈ సినిమాని వర్ణించవచ్చు. ఎంచుకున్న కథ, పాత్రల స్వభావం చాలా వరకు బాగానే నడిచినా కూడా కథలో బిగి లేకపోవడం వలన, సినిమా మొదలైన కాసేపటికే ఏం జరగబోతోంది అనేది ప్రేక్షకుడు ఈజీ గా చెప్పేయగలిగేలా ఉండడం వలన సెకండ్ హాఫ్ అంతగా ఏమీ ఆకట్టుకోదు. సినిమా మొదలైన్నప్పటి నుండి ఫ్లాట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఏమీ ఉండవు. అన్నీ ప్రేక్షకుడు ఊహకి తగ్గట్టే వెల్తూ ఉంటాయి. డైరెక్టర్ ఉద్దెశం సరిగ్గానే ఉన్న కానీ కథనం ఇంకొంచెం మెరుగ్గా ఉంటె బాగుండేది. పాత్రల తాలూకు వ్యక్తిత్వం ఇంకొంచెం లోతుగా చూపించాల్సి ఉండాల్సింది.
నటీనటులు:
కొత్త నటులు ఎస్తేర్ అనిల్ తన పాత్రకు న్యాయం చేసింది. కానీ సొంత డబ్బింగ్ చేయడం వలన తన నేపధ్యానికి తన సొంత డబ్బింగ్ అతికినట్టు అనిపించదు. పోలిష్ గా మాట్లాడినట్టు ఉండడం వలన కొంచెం ఇబ్బంది గా అనిపిస్తుంటుంది. పేద రైతుగా ఈశ్వరి రావు నటన ఆకట్టుకుంది. తనకి పేరు పెట్టడానికి ఏమీ లేదు. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ కూడా పాత్రకి తగ్గ న్యాయం చేసాడు. యువ రాజకీయ నటుడిగా చైతన్య కృష్ణ బాగానే చేసాడు. రన్నర్ గా చేసిన నైనా గంగూలీ తన పాత్రకి న్యాయం చేసింది.
టెక్నిషియన్స్:
దర్శకుడి ఆర్టిస్ట్స్ సెలక్షన్, వాళ్ళ నుండి తనకి కావాల్సిన ఎమోషన్ రాబట్టుకోవడం లో విజయవంతం అయ్యాడు దర్శకుడు తేజ మార్ని. ఎంచుకున్న కథ బాగానే ఉన్న కథనం ఇంకొంచెం బిగి ఉండాల్సింది. ‘కానీ అనే పదం ముందు అంత అబద్దం, దాని తర్వాత వచ్చే మాటలే నిజం’, ‘మనం చచ్చినా దేశం బతకాలి’, ‘నన్ను పుట్టించిన ఆ దేవుడే నాతో పోటీకొచ్చిన ఓడిస్తాను.. నా మీద నాకు అంత నమ్మకం’ లాంటి డైలాగ్స్ కొన్ని బాగానే ఉన్నప్పటికీ ఇంకా చాలా చోట్ల మంచి డైలాగ్స్ పడితే ఇంకా బాగుండేది. ప్రియదర్శన్ అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. జగదీష్ చీకటి ఛాయా గ్రహణం బాగుంది. భాను సందీప్ మార్ని తన సినిమాకి ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెట్టాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఈ మధ్య వచ్చే చిన్న సినిమాలు మరీ ఘోరంగా ఉంటున్నాయి. కానీ ఈ సినిమాకి నిర్మాణ విలువల ఎక్కడా తగ్గలేదు.