ముంబై: మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తాజాగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు చేశారు. 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో అంబటి రాయుడిని జట్టుకు ఎంపిక చేయకపోవడంలో కోహ్లీ పాత్ర ఉందని ఉతప్ప వ్యాఖ్యానించారు.
కోహ్లీ తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేవాడని, రాయుడు అందుకు బలైనట్లు పేర్కొన్నారు.
ఉతప్ప వివరణ ప్రకారం, రాయుడు కిట్ బ్యాగ్, జెర్సీ సిద్దం చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో విజయ్ శంకర్‌ను తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ‘‘ఇష్టాయిష్టాల ఆధారంగా ఆటగాళ్ల అవకాశాలను దెబ్బతీయడం సబబు కాదు,’’ అని ఉతప్ప అన్నారు.
2019 ప్రపంచ కప్ సెలక్షన్ అప్పట్లో వివాదాస్పదమైంది. ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఉతప్ప తాజా వ్యాఖ్యలు ఈ పాత వివాదాన్ని మరింత ప్రాధాన్యమిచ్చాయి. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు కోహ్లీపై ఉతప్ప వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.