తిరుపతి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంచు మనోజ్ దంపతులు తిరుపతిలో జరిగిన జల్లికట్టు ఉత్సవాలకు హాజరయ్యారు.
అయితే, యూనివర్సిటీ వద్ద మనోజ్ ఫ్లెక్సీలు తొలగించిన అంశం చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత మనోజ్ దంపతులు నారావారిపల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేశ్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లోకేశ్‌తో మనోజ్ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సినీ రంగం, మంచు మోహన్ బాబుతో కొనసాగుతున్న వివాదం వంటి అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం.
మనోజ్, మౌనికలు త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారా? టీడీపీ పక్షాన మద్దతు ప్రకటించబోతున్నారా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో జోరుగా చర్చించబడుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇప్పటికే మంచు కుటుంబం నుండి మంచు విష్ణు నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. తిరుపతిలో వారి ఫ్లెక్సీలు కూడా దర్శనమివ్వడంతో, మంచు కుటుంబం టీడీపీ వైపు మొగ్గు చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోకేశ్‌తో భేటీ అనంతరం, మనోజ్ దంపతులు రంగంపేట జల్లికట్టు ఉత్సవాలను వీక్షించారు. ఈ భేటీ రాజకీయ రంగంలో కొత్త చర్చలకు తెరలేపింది. ఇక మంచు కుటుంబం మొత్తం టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అనే అంశం వేడి చర్చగా మారింది.