విజయవాడ: భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్ జగన్ వీక్షించారు.
సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం దేశంలోని వ్యవస్థలు నడుచుకోవాలి’ అని అన్నారు.
వాలంటీర్ల వ్యవస్తపై ప్రశంసలు:
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ/వార్డు వలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు గ్రామ/వార్డు వాలంటీర్లు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. వాలంటీర్ల మెరుగైన పనితీరును చూసి గర్విస్తున్నానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ‘ఏడాది క్రితం రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, లబ్దిదారుల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందించే ప్రయాణాన్ని ప్రారంభించాం. ఏడాది ప్రయాణంలో మెరుగైన పనితీరు కనబర్చిన మా #ఆఫ్విల్లగెవర్రిఒర్స్ కృషి పట్ల గర్వంగా ఉంది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు చక్కగా పనిచేశారు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.