ఆంధ్రప్రదేశ్: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ పొలం పనుల్లో పాల్గొన్నారు.
కనుమ పండుగ సందర్భంగా సొంతూరైన ఏలూరు జిల్లా ఆగర్తిపాలెంలో మంత్రి తన పొలంలో వరి చేనుకు పురుగుల మందు పిచికారీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పొలం పనుల్లో నిమగ్నమైన రామానాయుడు రైతుగా తన మూలాలను మరువలేదని మరోసారి చాటిచెప్పారు. సొంతూరిలో రైతుల సమస్యలు తెలుసుకుంటూ, వారికి మద్దతు ఇస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రైతుల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వారి కష్టాలను తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
‘‘రైతులు అమ్మిన ధాన్యానికి 48 గంటల్లోనే డబ్బులు అందించడాన్ని మొదటిసారి చూస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే,’’ అని మంత్రి అన్నారు. భవిష్యత్తులోనూ రైతులకు మరింత మద్దతు ఇచ్చేలా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
నిమ్మల రామానాయుడు వినయంగా వ్యవహరిస్తూ, మట్టిని మురిపించే మానవీయ వైఖరితో మంత్రి పదవికి మరింత విలువను జోడించారు. రైతులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.