ఏపీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య నిన్న జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
దాదాపు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి వివిధ ప్రతిపాదనలు, సమస్యలపై చంద్రబాబు అమిత్ షాకు విజ్ఞప్తులు చేశారు.
ముఖ్యంగా, నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఎక్కువగా దృష్టి సారించిన చంద్రబాబు, కృష్ణా-గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతాల సమస్యలు తీర్చవచ్చని వివరించారు.
తెలంగాణ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ లేఖలు పంపడంపై చంద్రబాబు, అమిత్ షాకు కూలంకషంగా వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు వల్ల ఏపీకి కలిగే ప్రయోజనాలను గుర్తుచేశారు.
అదేవిధంగా, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్-2పై పునఃసమీక్ష అవసరమని, ఇది దౌత్యపరంగా పరిష్కారం కావడం ఉత్తమమని సూచించారు.
అలాగే, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ నిధుల విషయంలో కేంద్రం సహకారంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులపై చంద్రబాబు, బీజేపీతో తమ మైత్రిని ప్రస్తావించగా, అమిత్ షా క్షేత్రస్థాయిలో కొంత అసంతృప్తి ఉందని, దాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు, కూటమి సర్కారు పాలనపై అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. జీడీపీ పెంపుపై మరింత శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.