కౌలాలంపూర్: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత యువతరంగం మలేషియాపై అద్భుత విజయం సాధించింది.
కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును దెబ్బతీసింది. మలేషియా నిర్దేశించిన 32 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 2.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేధించింది.
ఓపెనర్లు గొంగడి త్రిష (21 నాటౌట్), కమిలిని (4 నాటౌట్) ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసి విజయాన్ని సులభతరం చేశారు. త్రిష కేవలం 12 బంతుల్లో 5 బౌండరీలతో ఆకట్టుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన మలేషియా 14.3 ఓవర్లలో కేవలం 31 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును పూర్తిగా కట్టడి చేశారు.
స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ వికెట్లు సహా మొత్తం 5 వికెట్లు తీయడం మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఆమె అద్భుత ప్రదర్శనకు “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు దక్కింది.
అలాగే, ఆయుశి 3 వికెట్లు, జోషిత 1 వికెట్ తీసి మలేషియా బ్యాటర్లను ఇబ్బందుల్లో పడేశారు. మలేషియా బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు, ఏకంగా నలుగురు డకౌట్ అయ్యారు.
ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన టీమిండియా, తమ బౌలింగ్ దూకుడుతో మరోసారి ప్రాభవం చాటింది.