జాతీయం: దిల్లీ ఎన్నికల కోసం ఆప్ మధ్యతరగతి మ్యానిఫెస్టో విడుదల
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో, రాజకీయ పార్టీలు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ను ప్రకటించి, మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకునేలా ముందుకొచ్చింది.
బుధవారం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో దేశంలోని మధ్యతరగతి ప్రజల కోసం పార్లమెంటులో లేవనెత్తబోయే ఏడు ప్రధాన డిమాండ్లను పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారని, వారు అధికంగా పన్నులు చెల్లించినప్పటికీ తగిన ప్రయోజనాలు పొందలేకపోతున్నారని కేజ్రీవాల్ అన్నారు.
దిల్లీలో వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆప్ పార్టీ గతంలో ప్రవేశపెట్టిన సంజీవని పథకాన్ని ఈ సందర్భంలో గుర్తుచేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును ప్రజల సంక్షేమానికి వినియోగించడం ద్వారా దేశ అభివృద్ధిని సాధించవచ్చని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే, కొన్ని వర్గాలు ఈ పథకాలపై ఉచితాలంటూ విమర్శలు చేస్తుండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
మధ్యతరగతి మ్యానిఫెస్టోలో ప్రతిపాదించిన డిమాండ్లు
- విద్య బడ్జెట్‌ను ప్రస్తుత 2 శాతం నుంచి 10 శాతానికి పెంచడం. ప్రైవేటు పాఠశాల ఫీజులను నియంత్రించడం.
- మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నత విద్యను సులభతరం చేసే రాయితీల ప్రవేశం.
- ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచడంతో పాటు ఆరోగ్య బీమాపై పన్నును ఎత్తివేయడం.
- ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
- నిత్యావసర వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం.
- సీనియర్ సిటిజన్లకు మెరుగైన పింఛన్ పథకాలను ప్రవేశపెట్టడం.
- రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీని పునరుద్ధరించడం.
కేజ్రీవాల్ విదేశాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలను మెచ్చుకుంటామని, అదే విధంగా మన దేశంలో పథకాలు తీసుకురాగానే విమర్శలు రావడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును వారి ప్రయోజనాలకు వినియోగిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.