మూవీడెస్క్: సిండికేట్! ఇండియన్ సినిమాను ఓ కొత్త దిశలో తీర్చిదిద్దిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
గ్యాంగ్‌స్టర్ డ్రామాల విషయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వర్మ, తన కల్ట్ క్లాసిక్ మూవీ ‘సత్య’తో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలతో తన ఫాలోవర్స్‌ను నిరాశపరిచారు.
తాజాగా, ‘సత్య’ సినిమా మళ్లీ చూసిన తర్వాత తనకు జరిగిన జ్ఞానోదయంతో ఇకపై ఉత్తమ చిత్రాలే చేస్తానని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
వర్మ లేటెస్ట్‌గా తన కొత్త ప్రాజెక్ట్ ‘సిండికేట్’ను అధికారికంగా ప్రకటించారు.
1970ల నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
“ఒక మనిషి అత్యంత భయంకరమైన మృగంగా మారగలడు” అనే సాలిడ్ లైన్‌తో ఈ కథను పుట్టించారని వర్మ తెలిపారు.
ఈ చిత్రంలో అతీత శక్తులకు చోటు లేకుండా, మనిషి తన స్వభావంతోనే ఎంత భయంకరంగా ఉంటాడన్నదే ప్రధానాంశమని చెప్పారు.
‘సిండికేట్’ సినిమా రియలిస్టిక్ నేరేషన్‌తో తెరకెక్కనుండటంతో, ఇది వర్మకు తిరుగులేని కం బ్యాక్ అవుతుందనే విశ్వాసం ఫ్యాన్స్‌లో ఉంది.
నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తానని వర్మ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భయానకంగా, గ్యాంగ్‌స్టర్ డ్రామాలో మైలురాయిగా నిలిపేలా తీర్చిదిద్దుతానని ప్రకటించారు.